ఆసిఫాబాద్ బిడ్డకు అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీలో పీజీ సీటు
తల్లి ఆశా వర్కర్.. అయినా తన బిడ్డ చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఆశ పడింది. ఆమె ఆశకు తగ్గట్టుగానే ఆ కూతురు తన ప్రతిభ దేశంలోనే అత్యున్నతమైన యూనివర్సిటీలో సీటు సాధించింది.. వివరాల్లోకి వెళితే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కుషేన్పల్లి గ్రామానికి చెందిన పడాల స్రవంతి.. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవల అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ నిర్వహించిన పీజీ ఎంట్రెన్స్‌లో స్రవంతి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఎంఏ ఎడ్యుకేషన్‌లో సీటు వచ్చినట్లు యూనివర్సిటీ స్రవంతికి ఆఫర్ లెటర్ బుధవారం పంపించింది.
స్రవంతి చిన్నప్పట్నుంచే తన చదువుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేది. స్రవంతి తల్లి ఆశా వర్కర్ అయినా, తన బిడ్డ చదువు కోసం అన్ని రకాలుగా శ్రమించింది. ఆమె శ్రమ వృథా కాలేదు. ఉన్నత విద్యను చదివేందుకు ప్రోత్సహించేది. పదో తరగతి వరకు బెజ్జూరులోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో చదివి.. 8.3 గ్రేడ్ సాధించిన స్రవంతి… ఆసిఫాబాద్ టీఎస్ మోడల్ స్కూల్లో ఇంటర్ వరకు చదివింది. ఇంటర్లో కూడా 856 మార్కులు సాధించింది. బీఏ ఎకానమిక్స్‌లో 9.64 గ్రేడ్ పాయింట్లు సాధించింది. ఇక పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేందుకు అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీలో సీటు కొట్టింది.