బ్రేకింగ్.. తీన్మార్ మల్లన్నను ఎత్తుకుపోయారు..
-పోలీసుల నిర్బంధం మధ్య ఆరెపల్లికి వచ్చిన మల్లన్న
వరంగల్: వరంగల్ జిల్లా ఆరెపల్లిలో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున రైతులు, మహిళలు మల్లన్న అరెస్టు అడ్డుకునే ప్రయత్నంలో కొద్దిసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసి పోలీసులు స్టేషన్ తరలించారు…
వరంగల్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం రైతుల భూములు తీసుకునేందుకు సిద్ధమైంది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు నేతలు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం తెచ్చిన జీఓ 80A ను ప్రభుత్వమే రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు ప్రకటించారు. ఈ మేరకు కొద్ది రోజులుగా ఆరెపల్లిలో ఆందోళన కొనసాగుతోంది. ఈ మేరకు శనివారం అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ ఆందోళనకు తీన్మార్ మల్లన్న మద్దతు ప్రకటించారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాజిపేట, పరకాలలోని ఇద్దరు ఏసిపిలు, 4 సిఐలు, పెద్ద ఎత్తున పోలీసులతో ఒక రకంగా గ్రామాన్ని దిగ్బంధించారు. అయినా బైక్‌పై తీన్మార్ మల్లన్న ఆరెపల్లికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. ప్రభుత్వం తెచ్చిన జీఓ 80A ను ప్రభుత్వమే రద్దు చేసే వరకు పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. దానికి నా పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు .. మీకోసం ప్రభుత్వంతో కొట్లాడతా అని తీన్మార్ మల్లన్న గ్రామస్తులకు భరోసా కల్పించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు మల్లన్నను అరెస్టు చేసేందుకు పోచమ్మ దేవాలయానికి బూట్లతో రావడంతో ప్రజలు, రైతులు తిరగబడ్డారు. తమ మనో భావాలు దెబ్బతిన్నాయని ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు పోలీసులు వెనక్కి తగ్గారు. గో బ్యాక్ పోలీస్ అంటూ నినాదాలు చేశారు. ఆరెపల్లి పోచమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళలు తీవ్ర ఆందోళన చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. పోలీసులు లోపలికి రాకుండా తీన్మార్ మల్లన్న చుట్టూ మహిళలు కూర్చున్నారు. చివరకు పోలీసులు తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకువెళ్లారు.