అభివృద్ధి ఉద్యమం సాగుతోంది
-ప్రజల కోసం.. ప్రగతి కోసం పనిచేస్తున్నాం
-తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఇదే
-బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి
-ప్రజల దీవెనలతో ముందుకు సాగుతున్నాం
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల : ఎంతో కష్టపడి, ప్రాణాలకు సైతం తెగించి ఉద్యమాలు చేసి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం సాగుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల పెరేడ్ గ్రౌండ్స్‌లో పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలన్న ధృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు పథకాలకు రూపలక్పన చేసి అమలు చేస్తున్నారని తెలిపారు.
“దళితబంధు” పథకం ద్వారా అర్హత గల ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. మంచిర్యాల జిల్లాలో ఈ పథకం కింద రెండు వందల యాభై ఒక్క మంది లబ్దిదారుల ఖాతాల్లో ఇరవై మూడు కోట్ల రూపాయల దళితబంధు నిధులు జమ చేసినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ విద్యా సంవత్సరం నుండి వైద్య కళాశాల తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గర్భిణులకు ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగే విధంగా చైతన్యం చేసి మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది అర్హులైన బాలింతలకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
సింగరేణిలో ప్రాంతంలో నివాసం ఉంటున్న అర్హులను గుర్తించి జీ.ఓ. నంబరు 76 ద్వారా శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ప్రాంతాలలో వేలాది కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల సాకారమైందని, ఇంకా అర్హులకు పట్టాల పంపిణీ ప్రక్రియ సాగుతుందన్నారు. రెండు పడక గదుల పథకంలో భాగంగా జిల్లాలో నూట ముప్పై కోట్ల రూపాయలతో రెండు వేల నాలుగు వందల పదహారు ఇళ్ళు మంజూరు అయ్యాయని, అందులో ఒక వేయి నలభై నాలుగు ఇళ్ళ నిర్మాణాలు పూర్తి జరిగిందని తెలిపారు.