బొట్టు మీకు.. మీ పిల్లలు మాకు…
పని చేయాలనే తపన.. తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయాలనే ఆలోచన వెరసి.. ఆ ఉద్యోగిని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. అటు పిల్లల తల్లిదండ్రులతో పాటు, అధికారులు సైతం ఆమె చేస్తున్న పనిని మెచ్చుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్1 అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు రాధ తమ కేంద్రానికి పిల్లలు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని ఆమె మంచిగా వినియోగించుకుంటున్నారు. తన పరిధిలో ఇంటింటి తిరుగుతూ మహిళలకు బొట్టు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. మీ పిల్లలను మా బడికే పంపాలంటూ వారికి చెబుతున్నారు. అదే సమయంలో ప్లే స్కూల్ లేదని చింత ఎందుకు..? ప‌్రీ స్కూల్ మీ చెంత ఉండగ అంటూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రల్లోనే పిల్లలకు అన్ని రకాల ఆట వస్తువులు, రంగు రంగు పుస్తకాలు, పెన్సిళ్లు ఇస్తామని, పిల్లలు ఆడుతూ, పాడుతూ చదువుకుంటారని అలాంటి తమ కేంద్రానికి మీ పిల్లలను పంపాలని ఆ కరపత్రాల్లో ముద్రించారు.
అంగన్‌వాడీ కేంద్రాలు అంటేనే కోడిగుడ్లు, బాలామృతం అమ్ముకునే కేంద్రాలు ముద్ర పడిన ఈ రోజుల్లో టీచర్ రాధ చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ పనిచేస్తే ఖచ్చితంగా ప్రైవేటు పాఠశాలల అవసరమే రాని చెబుతున్నారు. మంగళవారం మార్కెట్ కమిటీ ఏడీ శ్రీనివాస్ ఈ అంగన్‌వాడీ బాట కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. టీచర్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన మెచ్చుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ స్వాగత్, ఏఎల్ఎంఎస్ కమిటీ సభ్యులు ఆర్‌పీ ఫరీదా, మున్సిపల్ సిబ్బంది సుజాత, పోషక్క, సునీత, ఆశా వర్కర్లు స్వప్న, రాజనాలు తదితరులు పాల్గొన్నారు.