రిమ్స్ ఎదుట ఆందోళన
ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి కరోనా బ్లాక్ ఎదుట శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ పేషెంట్ కేర్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. 2 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, యూనిఫామ్స్,షూస్,గ్లవ్స్ ఇచ్చి కార్మికులను ఆదుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ పెండింగ్ వేతనాలతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, రిమ్స్ డైరెక్టర్ కి వినతిప్రతం ఇచ్చామన్నారు. అయినా సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పార్క్ ఏజెన్సీ గడువు అయిపోయినా ఏజెన్సీ ఎందుకు కొనసాగిస్తున్నారో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత ఏజెన్సీని తొలగించి కొత్త టెండర్ పిలవాలన్నారు. జీవో 21 అమలు చేసి పెరిగిన జీతాలు ఇప్పించాలన్నారు. లేకపోతే ఆదివారం వరకు రోజు ఒక గంట నిరసన ధర్నా, సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామన్నారు. ఆ విధంగా కూడా స్పందించకుంటే సమ్మెకు పోవడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు కన్నలలక్ష్మీ,కమల,రుక్మిణి,లక్ష్మీ,మంగమ్మ,లస్మమ్మ పాల్గొన్నారు.