అధికార పార్టీ నేతల గూండాగిరి
-సామాన్యుల పై టీఆర్ఎస్ నేతల దాడి
-ఇంట్లోకి వెళ్లి మహిళపై కూడా దౌర్జన్యం
-అడ్డు వచ్చిన విలేకరుల పైనా జులుం
-ఇష్టారాజ్యంగా టీఆరెఎస్ నేతల ప్రవర్తన
అధికార బలం ఉంటే ఏమయినా చెయ్యచ్చు.. సామాన్యుల ఇంట్లోకి వెళ్లి మరీ దాడి చెయ్యచ్చు.. మగ, ఆడ అవసరం లేదు.. అధికార బలం ఉంటే చాలు…
మోటర్ సైకిళ్ళు ఎందుకు ఢీ కొట్టారని ప్రశ్నించినందుకు, టిఆర్ఎస్ కార్పోరేటర్లు దాడికి దిగి, ఆడవాళ్లు అని కూడా చూడకుండా చితకబాదిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది.ఉదయ్ నగర్ లో ఇంటి ముందు, నిలిపి ఉన్న మోటర్ సైకిళ్ళను 10వ డివిజన్ కార్పోరేటర్ అడ్డాల గట్టయ్య కారుతో ఢీ కొట్టాడు. ఇదేమింటని ప్రశ్నించిన ఇంటి యాజమాని చందుపట్ల వేణుగోపాల్ రెడ్డి అతని భార్య ప్రమిద కుమారిపై కార్పోరేటర్ అతని అనుచరులు దాడి చేశారు. మాజీ కార్పోరేటర్ ధరణీ జలపతి, టీబీజీకేఎస్ నాయకుడు పోలాడి శ్రీనివాస్ రావు, జువ్వాడి వెంకట్ సైతం దాడి చేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన పాత్రికేయుడు కుమార్ ,సిఐటియు నాయకుడు మెండ శ్రీనివాస్ పై కూడా దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న నలుగురు ఇంట్లో చొరబడి, బూతులు తిడుతూ దాడికి దిగారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వచ్చి, దాడికి పాల్పడిన వారిని వారించినా వినలేదు. బాధితులను పోలీసులు వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.