కన్నకొడుక్కి తలకొరివి పెట్టిన తల్లి…
పెళ్లయిన ఐదేళ్లకే భర్తని కోల్పోయినా.. ఆమె కొడుకే జీవితంగా బతికింది. ఆశలన్నీ ఆ బిడ్డపైనే పెట్టుకుంది. ఐదేళ్లకే భర్తని తీసుకుపోయిన ఆ దేవుడు చేతికందే కొడుకును కూడా దూరం చేశాడు. చేతికి అంది వచ్చే కొడుకు కూడా దూరం అవడంతో ఆ తల్లి కన్నీటికి అంతే లేకుండా పోయింది. ఏకాకైన ఆమే చివరికి కన్నకొడుకు చితికి తలకొరివి పెట్టాల్సిన గతి పట్టింది. ఒక తల్లికి ఇంతకి మించిన గుండెకోత మరోటి ఉండదేమో..!
వివరాల్లోకి వెళ్తే…. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన గేదెల మోహన్‌రావు (24) విశాఖపట్నంలో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి రమేశ్, మోహన్‌రావుకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే చనిపోయాడు. తల్లి ఢిల్లమ్మ అన్నీ తానై కొడుకును పెంచింది. కూలీ పనులు చేసుకునే ఢిల్లమ్మకు కొడుకు మోహన్‌రావు ఇప్పుడిప్పుడే చేతికి అందిస్తున్నాడు. తానొకటి తలిస్తే దైవం మరోటి తలచిన చందంగా ఈ నెల 10న ఇంటి పనులు చేస్తుండగా మోహన్‌రావు భవనం నుంచి జారి కిందపడ్డాడు. తలతో పాటు ఇతర భాగాలకూ దెబ్బలు తగిలాయి. వెంటనే మోహన్ రావును విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చేర్పించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహన్‌రావు మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వగ్రామమైన కాపుగోదాయవలస గ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబంలో ఎవరూ లేకపోవడంతో తల్లి ఢిల్లమ్మే తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించింది. ఇది చూసిన గ్రామస్థులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు.