సింగరేణిలో ఉద్యోగాల జాతర
-177 ఎక్స్ టర్నల్ క్లర్కు పోస్టులకు నోటిఫికేషన్
-ఈ నెల 20 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ
సింగరేణి సంస్థలో ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్) పోస్టులు భర్తీ చేయనున్నారు. 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ I,2 (క్లర్కు) పోస్టుల భర్తీ కోసం గురువారం యాజమాన్యం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగరేణిలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సంస్థ సిఅండ్ఎండి శ్రీధర్ ఆదేశించిన నేపథ్యంలో డైరెక్టర్ పర్సనల్ ఎన్.బలరామ్ సారథ్యంలో ఖాళీలను గుర్తించారు. ఎక్స్టర్నల్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల ఇంటర్నల్ అభ్యర్థుల కోసం కూడా ప్రకటించిన పోస్టులకు ఇవి అదనం.
కనీస బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్స్/ఐ.టి. సబెక్టుగా ఉన్న వారు లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా 6 నెలల సర్టిఫికేట్ కోర్సు విధిగా పాసై ఉండాలి. గరిష్ట వయసు 30 ఏళ్లు, ఎస్.సి, ఎస్.టి., బి.సి.లకు 5 సంవత్సరాల మినహాయింపు ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పై ఉద్యోగాల్లో 95 శాతం లోకల్ అభ్యర్థులకు అనగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన 5 శాతం పోస్టులు అన్ రిజర్వుడు కోటాకింద ఓపెన్ టు ఆల్ (అందరికీ అవకాశంగా) తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక ఉంటుందని డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) ఎన్.బలరామ్ తెలిపారు.
దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ నుండి ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తారన్నారు. అలాగే దరఖాస్తుల స్వీకరణకు జులై 10 తేదీని తుది గడువుగా నిర్ణయించామన్నారు. ఇంకా ఇతర వివరాలు సింగరేణి వెబ్ సైట్లో పొందుపరిచామని, వెబ్ సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను www.scclmines.com లో Careers లో విభాగంలో పొందుపరిచారు.