పక్కా ప్లాన్ ప్రకారమే..
-వాట్సప్ గ్రూపుల్లో సందేశాలు
-జిల్లాల నుంచి రాత్రే చేరుకున్న ఆందోళనకారులు
-ఒక్కసారిగా దూసుకువచ్చి విధ్వంసం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. ఆర్మీ ఉద్యోగ ఆశావహులు వాట్సాప్ గ్రూపుల్లో ఈ సందేశాన్ని ముందుగానే సర్క్యులేట్ చేసినట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చి ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు సంఘటనలు జరిగిన తీరును చూస్తే అర్థమవుతోంది.
వాట్సప్ గ్రూపుల ద్వారా సమాచారం…
ఎలాగైన ఆందోళన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న వారు పూర్తి స్థాయిలో పథక రచన చేశారు. ఆందోళన కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి యువకులు గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. జిల్లాల వారీగా వాళ్లంతా వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరసన కోసం గురువారం రాత్రే అక్కడికి చేరుకున్నారు. తొలుత శుక్రవారం ఉదయం స్టేషన్ బయటే యువకులు కాసేపు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడే బస్సు అద్దాలను పగులగొట్టారు.
కొనసాగిన విధ్వంసం..
తర్వాత ఉదయం 9 గంటల సమయంలో ఆందోళనకారులు ఒక్కసారిగా సికింద్రాబాద్ స్టేషన్ లోపలికి దూసుకొచ్చి పట్టాలపై బైఠాయించారు. అనంతరం ప్లాట్‌ఫాంపై ఉన్న స్టాళ్లను తొలగించడం, స్టేషన్‌లో నిలిపిన పలు రైళ్ల కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత రైల్వే పార్సిల్ విభాగం వద్ద ఉన్న వస్తువులను తీసుకొచ్చి పట్టాలపై వేసి తగులబెట్టారు. తర్వాత ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు బలగాలు స్టేషన్‌లోకి వచ్చాయి. ఈ క్రమంలో వాళ్లపై ఆందోళనకారులు రాళ్ల వర్షం కురిపించారు. అప్పటికే పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించినా ఆందోళన సద్దుమణగక పోవడంతో రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.