ఓసీపీ త్రీలో కార్మికుల విధుల బహిష్కరణ
ఆందోళనకు కార్మిక సంఘాల మద్దతు

సింగరేణిలో యాజమాన్యం వైఖరిపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణ ప్రోత్సహించే దిశగా అధికారులు వ్యవహరించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఆర్జీ 2 ఏరియా ఓసీపీ 3 లో డంపర్ ఆపరేటర్లు విధులు బహిష్కరించారు. ప్రైవేటు లోడర్ తో కంపెనీ డంపర్ లలో కోల్ లోడింగ్ ప్రక్రియ నిర్వహించడంతో ఆందోళనకు దిగారు. దీనిని వెంటనే యాజమాన్యం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ యాజమాన్యం కార్మికులను భయాందోళనలకు గురిచేస్తోందన్నారు. సింగరేణి యాజమాన్యం వందల కోట్లు ఖర్చు చేసి షావల్ యంత్రాలను కొనుగోలు చేస్తోందని తెలిపారు. స్పేర్ పార్ట్స్ లేక మరమ్మతులు చేయక వాటిని వినియోగించుకోకపోవడంతో అవి మూలకు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల ప్రణాళిక లోపం వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. యంత్రాలకు కాస్ట్ క్యాప్ ఉన్నా వారు సరైన సమయంలో పార్ట్స్ అందించడం లేదని…? అలాంటప్పుడు ఆ సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి పని సక్రమంగా జరడం లేదని, అందుకే ప్రైవేట్ లోడర్ పెడుతామన్ని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
అధికారులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉత్పత్తి సాధనలో ఎప్పటికప్పుడు ముందు ఉంటున్నామని స్పష్టం చేశారు. యంత్రాలను ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేసి అందుబాటులో ఉంచాలని కోరారు. ఆ బాధ్యత ఓసీసీ త్రీ యాజమాన్యంపై ఉందన్నారు. ప్రైవేటు లోడర్ తొలగించి కంపెనీ యంత్రాలను మరమ్మతు చేసి అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
కార్మికుల ఆందోళనకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మద్దతు తెలిపింది. ప్రైవేటు లోడర్ తొలగించాలని, కంపెనీ యంత్రాలు అందుబాటులో ఉంచాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వారిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు ఆయిలి శ్రీనివాస్,కొత్త సత్యనారాయణ రెడ్డి,శంకర్ నాయక్,బనాకర్,ఐ.సత్యం,ఎట్టం కృష్ణ,బేతి చంద్రయ్య ఉన్నారు.