ఆమె టీచర్ కాదు.. అడిషనల్ కలెక్టర్..
పిల్లలూ మీకు వన్.. టూ.. త్రీ వచ్చా అంటూ అడిగింది.. పిల్లలు అరగంట పాటు పాఠాలు సైతం చెప్పింది. అయితే ఆమె మాత్రం ఉపాధ్యాయుని కాదు.. పాఠశాలలో ఇంత దీక్షగా పాఠాలు చెప్పిన ఆమె ఎవరా..? అని ఆరా తీస్తే తను అడిషనల్ కలెక్టర్ అని తేలింది.
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గంట పాటు టీచరమ్మలా మారారు. ఆమె కౌటాల మండలంలో పర్యటించారు. ఈ క్రమంలో ముత్యంపేట్లో స్థానిక ప్రైమరీ పాఠశాలకి వెళ్లిన ఆమె విద్యార్థులను గుడ్ మార్నింగ్ అంటూ పలకరించారు. వన్.. టు.. త్రి వచ్చా అంటూ పిల్లలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో మమేకమై అరగంట తరగతి గదిలో గడిపారు. ఉపాధ్యాయునిగా మారి వారికి పాఠాలు చెప్పారు. ఓ చిన్నారి ఇంటి నుంచి తెచ్చుకున్న చాక్లెట్ కవర్ తో సహా నోట్లో పెట్టుకుని నములుతుంటే అలాకాదు అంటూ నోట్లో నుంచి చాక్లెట్ తీసి, మళ్ళీ చాక్లెట్ కవర్ తీసి ఇచ్చారు. ఇదంతా ఒక్కెత్తు కాగా, ఆమె కాళ్లకు చెప్పులు లేకుండా తరగతి గదిలోకి వెళ్లి బడిని గుడిలా చూడాలన్న సందేశం పరోక్షంగా ఇచ్చారు. ఓ యువ ఐఏఎస్ అధికారిణి ఇలా పిల్లలతో మమేకమై కలిసిపోవడం నిజంగా అభినందనీయమని పలువురు గ్రామస్తులు వెల్లడించారు.