ఉమ్మడి ఆదిలాబాద్ లో పిడుగుల వాన..
-పిడుగుపాటుకు మరొకరు మృతి, కోమాలోకి వెళ్లిన మరో రైతు
-ఐదు రోజుల్లోనే ఏడుగురు రైతులు మృత్యువాత
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వాన కురుస్తోంది. పొలం పనులకు వెళ్లిన బడుగు జీవులపై పిడుగులు పడి అక్కడికక్కడే ప్రాణాలు వదులుతున్నారు. ఈ ఐదు రోజుల్లోనే ఏడుగురు రైతులు మృత్యువాతపడ్డారు. దీంతో రైతులు పొలాలు, చేన్లలో పనులు చేయాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేయాల్సి వస్తోంది.
ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. నేల చదును చేయించడం దగ్గర నుంచి విత్తనాలు వేసే పనుల్లో రైతులు, రైతు కూలీలు క్షణం తీరికలేకుండా ఉన్నారు. అయితే భారీగా వర్షాలు పడటమే కాకుండా, పిడుగులు సైతం పడుతుండటంతో వారు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఆదివారం కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి మండలం ఇందానీలో తల్లీ కొడుకులు ఇద్దరూ పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు. ఆ ఘటనలో మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. ఇక సోమవారం ఒక్కరోజే నలుగురు మరణించారు. కౌటాల మండలం వైగాంలో ఒకరు, రాస్పల్లి, అంకుసాపూర్ గ్రామాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున పిడుగుపడి చనిపోయారు. ఈ ఘటనల్లో మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఇక మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సర్వాయిపేటలో మరో మహిళ మృత్యువాత పడ్డారు.
తాజాగా, శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల రాజులగూడా గ్రామానికి చెందిన షేక్ అయ్యు పిడుగుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో గోవింద్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ కూలికి వెళ్లి న మధ్యాహ్నం సమయంలో వర్షం రావడంతో చెట్టు కింద నిలబడ్డారు. చెట్టుపై పిడుగు పడడంతో కింద ఉన్న షేక్ అయ్యు మృతి చెందారు. మరోవైపు చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన రౌతురావుజీ పై చేనులో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగు పడి కోమాలో వెళ్లాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు..