ఆడపిల్లలని తెలిసి కడుపులోనే చంపేశారు…
ఒకేసారి 7 పిండాలను కాల్వలో పడేసిన వైనం
ఆడపిల్ల అని తెలిస్తే చాలు పిండంగా ఉండగానే చంపేస్తున్నారు. దీనికి స్కానింగ్ సెంటర్ల దగ్గర నుంచి వైద్యుల వరకు అందరూ దోషులే. తాజాగా కర్నాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కాల్వలో ఏడు మృత పిండాలు కనపించడం షాకింగ్‌కు గురి చేసింది.
బెల్గావి జిల్లాలోని మూదలగి పట్టణ శివారులో ఏడు మృత పిండాలు లభించాయి. మూదలగి బస్టాప్‌కు కొద్ది దూరంలోని మురికి కాలువలో ఓ డబ్బాలో పిండాలు కనిపినట్లు పోలీసులు వెల్లడించారు. కొందరు స్థానికులు ఆ డబ్బాను గమనించి.. తిరిచి చూశారు. అందులో మృత పిండాల అవశేషాలు ఉండడంతో షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి… ఆ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఆ మృత పిండాలన్నీ 5 నుంచి 7 నెలల వయసు ఉన్నవిగా పోలీసులు గుర్తించారు. పరీక్షల కోసం వాటిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డబ్బాలో లభ్యమైన ఉన్న మృత పిండాలు ఆడ శిశువులుగా పోలీసులు వెల్లడించారు. ఏదైనా ప్రైవేట్ ఆసుత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఉంటారని..పరీక్షల్లో ఆడపిల్లలని తేలడంతో.. అబార్షన్ చేసి తొలగించి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి.. ఓ స్థానిక మెటర్నిటీ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు. డాక్టర్లతో పాటు అందులో పనిచేసే సిబ్బందిని అదుపులోకి విచారిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారు. బెలగావి జిల్లాలో ఇలా పిండాలు బయటపడటం ఇది రెండో సారి. 2013లో కూడా ఒకేసారి 13 పిండాలు బయటపడ్డాయి.