ఎస్ఆర్‌పీ 3 గని వద్ద ఉద్రికత్త
-కార్మికుడి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
-హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష
-అడ్డుకున్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది
-గని బయట గేటు వద్ద నిరసన కొనసాగిస్తున్న హెచ్ఎంఎస్ నేతలు

మంచిర్యాల :శ్రీరాంపూర్ డివిజన్ లోని ఎస్ఆర్‌పీ 3 గని వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గని ప్రమాదంలో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని హెచ్ఎంఎస్ నేతలు బుధవారం ఉదయం 24 గంటల దీక్షకు కూర్చున్నారు. అయితే, గని ఆవరణలో ఈ ఆందోళన సరికాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసులు,సీఆర్‌పీఎఫ్,సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగారు. హెచ్ఎంఎస్ నేతలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ తరలించి వదిలేశారు. వారు గని ఎదుట 24 గంటల దీక్ష కొనసాగిస్తున్నారు.
ఎస్ఆర్‌పీ 3 గనిలో గత ఏడాది నవంబర్ 10న రూఫ్ ఫాల్‌తో నలుగురు కార్మికులు చనిపోయారు. వారికి ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది కూడా. అయితే అందులో కృష్ణారెడ్డి అనే కార్మికుడి కుమారుడు వయసు 35 సంవత్సరాల 51 రోజులు ఉంది. వయసు 51 రోజులు ఎక్కువగా ఉంది కాబట్టి అతనికి ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరించింది. ఇది ప్రమాదం కాబట్టి ప్రత్యేక పరిస్థితుల కింద అతనికి ఉద్యోగం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దానికి యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో ఎక్కడైనా ప్రమాదంలో అధికారి చనిపోతే వారి కుటుంబ సభ్యులు కనీసం 10 వ తరగతి చదివినా చాలు గ్రేడ్ 3 క్లర్క్‌గా ఉద్యోగాలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారని మరి కార్మికుడి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడానికి ఇలాంటి నిబంధనలు ఎందుకని హెచ్ఎంఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో 24 గంటల దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ చనిపోయిన కార్మికుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ అధ్యక్షుడు నారాయణ, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు జీవన్ జోయల్, మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు పార్వతి రాజిరెడ్డి, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజబాబు, కార్యదర్శి తిప్పారపు సారయ్య, కేంద్ర కార్యదర్శి గోళ్ల సత్యనారాయణ, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ అనిల్‌రెడ్డి, ఆర్గనైజింగ్ స సెక్రటరీలు దుర్గం లక్ష్మణ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.