సింగరేణికి CPSU హోదా కల్పించండి

-కిషన్ రెడ్డిని క‌లిసి విజ్ఞప్తి చేసిన INTUC నేత‌లు
-మంత్రి సానుకూల స్పందన
-త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ

Singareni:సింగరేణి సంస్థ‌కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (Central Public Sector Undertaking – CPSU) హోదా కల్పించాలని INTUC నేత‌లు కోరారు. కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్, ఇత‌ర నాయ‌కులు శ్రీరాంపూర్ గెస్ట్ హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల సింగరేణికి తాడిచెర్ల–II బొగ్గు బ్లాక్‌ను కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం సింగరేణికి CPSU హోదా కల్పించాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. CPSU హోదా లభిస్తే భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడం, చట్టపరమైన, పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు కావడం, కొత్త గనుల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ‌తాయ‌ని వివరించారు. దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో సింగరేణి మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించార‌ని, సింగరేణికి CPSU హోదా కల్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన‌ట్లు ఐఎన్‌టీయూసీ నేత‌లు వెల్ల‌డించారు. మంత్రిని క‌లిసిన వారిలో INTUC సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, వైస్ ప్రెసిడెంట్లు శ్యామ్, దాస్, సదానందం, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, మైనింగ్ స్టాఫ్ ఇన్‌చార్జ్ తిరుపతి రాజు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గరిగె స్వామి తదితరులు ఉన్నారు.

You might also like