సింగ‌రేణికి అండ‌గా కేంద్రం

Singareni:సింగరేణికి అండగా కేంద్రం ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి (Union Minister of Coal and Mines G.Kishan Reddy) స్ప‌ష్టం చేశారు. భూపాలపల్లి జిల్లా(Bhupalpally District)లో కేటీకే-8 గనిని సందర్శించిన ఆయ‌న సింగరేణి భరోసా యాత్ర(Singareni Bharosa Yatra)లో కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలు, ఆందోళనలు తెలుసుకున్నారు. బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పని శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించిన స‌మావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాల కారణంగా సింగరేణి కార్మికుల్లో అభద్రతాభావం పెరిగిందని విమర్శించారు. సింగరేణిని గత ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాయని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జెన్‌కోకు సరఫరా చేసిన బొగ్గుకు సంబంధించి సింగరేణికి రావాల్సిన దాదాపు రూ.9,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ బకాయిల వల్ల సంస్థపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.

తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధిపట్ల తన నిబద్ధతను మరోసారి చాటిచెప్పారని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని మరింత బలోపేతం చేసి, పారదర్శక పాలన అందిస్తూ, కార్మికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిని తిరిగి స్థిరమైన లాభాల బాటలో నడిపించి, కార్మికులు, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు(BJP Telangana State President Ramchandra Rao) మాట్లాడుతూ, సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి సంస్థ అని అన్నారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. సింగరేణి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని, కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నీ బీజేపీ సహించదన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిని దేశంలోనే ఆదర్శ ప్రభుత్వ రంగ సంస్థగా తీర్చిదిద్దుతామని, కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్, బీజేపీ రాష్ట్ర, కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like