ప్రోటోకాల్ వివాదం.. దళిత సర్పంచ్ ఆగ్రహం
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరులో నిర్వహించిన ప్రభుత్వ అవగాహన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక దళిత సర్పంచ్ ఫొటోను ఆహ్వాన ఫ్లెక్సీలో పొందుపరచకపోవడంపై వివాదం చెలరేగింది. కావాలనే దళిత సర్పంచ్‌ను అవమానించారని ఆరోపిస్తూ ఆయనతో పాటు అనుచరులు ఆందోళనకు దిగడంతో కార్యక్రమం రసాభాసగా మారింది.
బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరులో నిర్వహించిన ప్రభుత్వ అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తాండూరు గ్రామ సర్పంచ్ ముడిమడుగుల సురేష్ ఫొటో లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం తన ఫొటో ఉండాల్సి ఉండగా ఉద్దేశపూర్వకంగానే తొలగించారని సర్పంచ్ ఆరోపించారు. ఈ విషయంపై డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డిని నేరుగా ప్రశ్నించడంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది.
సర్పంచ్‌కు మద్దతుగా ఆయన అనుచరులు, స్థానిక నాయకులు కూడా ఆందోళనకు దిగారు. తాండూరు మండల అధ్యక్షుడు శంకర్, డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి కావాలనే దళిత సర్పంచ్‌ను అవమానించారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ “డౌన్ డౌన్” అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో కార్యక్రమం కొంతసేపు నిలిచిపోయి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పరిస్థితిని సద్దుమణిగేలా నాయకులు ప్రయత్నించగా కార్యక్రమం రసాభాసగా ముగిసింది.