మళ్లీ ఉద్రిక్తంగా కోయపోశగూడెం
మంచిర్యాల : కోయపోశగూడెం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. కొద్ది రోజుల కిందట పోడు భూముల విషయంలో ఇక్కడి మహిళలు 12 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించగా, తిరిగి గురువారం ఆ గ్రామంలో గిరిజనులు కోర్ ఏరియాలో గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఫారెస్టు అధికారులు వాటిని తొలగించాలని గ్రామస్తులను కోరారు. దీనికి గిరిజనులు అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఫారెస్టు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫారెస్టు అధికారులు కలిసి ఆ గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించారు. దానిని గిరిజనులు అడ్డుకున్నారు. మొత్తానికి అధికారులు అక్కడ నుంచి గుడిసెలు తొలగించారు. కొద్ది రోజుల కిందట ఈ గ్రామానికి చెందిన గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకునేందుకు భూములు చదును చేసేందుకు ప్రయత్నించగా, ఫారెస్టు అధికారులు అడ్డుకుని కేసులు పెట్టారు. 12 మంది మహిళలు ఆదిలాబాద్ జైలుకు సైతం వెళ్లి వచ్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.