ఆ భూముల్లో మళ్లీ గుడిసెలు
-కోయపోశగూడెంలో మళ్లీ గుడిసెలు
-గూడెం చేరుకుంటున్న అటవీశాఖ అధికారులు
మంచిర్యాల : కోయపోశగూడెం పోడు భూముల ఆందోళన ఆగడం లేదు. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తూనే ఉంది. పోడు భూముల్లో సాగు చేసుకునేందుకు, అందులో గుడిసెలు వేసుకునేందుకు గిరిజనులు ప్రయత్నిస్తుండగా, వాటిని ఖాళీ చేయించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం ఈ ఘటన ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. పోలీసులు, ఫారెస్టు అధికారులు కలిసి గిరిజనులను అదుపులోకి తీసుకుని గుడిసెలు కూల్చివేశారు. గిరిజనులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి వదిలేశారు.
అయితే,రాత్రికి రాత్రే గిరిజనులు మళ్లీ అదే స్థానంలో తిరిగి తాత్కాలికంగా గుడిసెలు నిర్మించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ ప్రాంతం వదిలి పెట్టేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమ ప్రాణాలు పోయినా సరే, జాగా వదులుకోమని చెబుతున్నారు. ఈ భూమి విషయంలో చాలా రోజులుగా అధికారులు, గిరిజనులకు మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడి మహిళలు 12 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయినా గిరిజనులు వెనక్కి తగ్గలేదు. ఇక తాజాగా శనివారం కూడా గుడిసెలు వేసుకోవడంతో ఆ భూముల వద్దకు అటవీ శాఖ అధికారులు వెళ్తున్నారు.
మరోవైపు శుక్రవారం గిరిజన మహిళలపై జరిగిన దాడిని రాష్ట్ర మహిళా కమిషన్ ఖండించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.