టీఆర్ఎస్ నుంచి ప్రవీణ్ అనుచరుల సస్పెన్షన్
మంచిర్యాల : టీఆర్ఎస్ లో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంటోంది. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే ఫొటో పెట్టకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై వేటు వేశారు. టీఆర్ఎస్ నుంచి దుబ్బాక రామకృష్ణ, విశాల్, బంక రమేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ పేరుతో ఈ ప్రకటన చేశారు. ఆ ప్రకటనలోనే కింద నోట్ అని పెట్టి ఈ ముగ్గురు ఎమ్మెల్యే ఫొటో పెట్టకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొనడం గమనార్హం. దీనికి ఈ ముగ్గురు సైతం స్పందించారు. మూడు తరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నామని, తాము టీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నామని దుబ్బాక రామకృష్ణ వెల్లడించారు. తాము చేసిన తప్పల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌తో ఉండటమే అన్నారు. తమకు నచ్చిన వ్యక్తితో ఉండటం తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. మరి ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫొటోతో పాటు, ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుడు, బెల్లంపల్లి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని వారు స్పష్టం చేశారు.