కడెం.. భయం.. భయం.
-ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద
-సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
-అర్దరాత్రి దండోరా వేసి మరీ అప్రమత్తం
కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన 18 గేట్లలో 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒక్క గేటు మాత్రం ఓపెన్ కావడం లేదు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు పై నుండి వరద నీరు కిందకు వస్తోంది. అధికారులు కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కడెం ప్రాజెక్టుకు 64 ఏళ్ల క్రితం ఇంత భారీ స్థాయిలో వరద వచ్చినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ ఫ్లో కు తగ్గట్టుగా అవుట్ ఫ్లో లేని పరిస్థితి చోటు చేసుకొంది. దీంతో కడెం ప్రాజెక్టుపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రాజెక్టు పరివాహ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
కడెం, అన్నాపూర్, దేవునిగూడ, రాపాడు, మున్యాల తదితర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. కడెం లోని సుమారు 1100 వందల మందిని పోలీస్ స్టేషన్ , ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీప ప్రాంతాలకు తరలించారు. హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడకు చేరుకోనున్నాయి. కడెం ప్రాజెక్టుకు ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు పోటెత్తింది. కానీ ప్రాజెక్టు నుండి 2.98 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.