ప్రమాదం అంచున రాజీవ్ రహదారి
మంచిర్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను కలుపుతూ నిర్మించిన గోదావరి బ్రిడ్జి వద్ద రాజీవ్ రహదారి ప్రమాదకర పరిస్థితికి చేరుకుంది. గోదావరికి పెద్ద ఎత్తున వరదలు రావడంతో వంతెనను ఆనుకుని నీళ్లు ప్రవహించాయి. దాదాపు పది రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షాలు పడటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ వరదతో గోదావరి బ్రిడ్జి ఫిల్లర్‌కు, రోడ్డుకు మధ్య ఉన్న కరకట్ట, బండరాళ్లు కొట్టుకుపోయాయి. దీంతో రోడ్డు ఎప్పుడు కుంగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 1995 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి.రామారావు గోదావరిపై వంతెన ప్రారంభించారు. ఆ తర్వాత వంతెనకు అటు, ఇటూ రాజీవ్ రహదారి వేశారు. వంతెన ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు ఈ స్థాయిలో వరద రాలేదని పలువురు చెబుతున్నారు. ఎల్లంపల్లి బ్యారేజి నుంచి భారీగా వరద నీరు రావటంతో వంతెనపై రాకపోకలు సైతం నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇలాంటి వరద వల్ల ఫిల్లర్‌కు, రోడ్డుకు మధ్య కరకట్ట, బండరాళ్లు కొట్టుకుపోయాయని చెబుతున్నారు. అయితే, కరీంనగర్ నుంచి మంచిర్యాల్ జిల్లా ఇందారం వరకు రాజీవ్ రహదారి హెచ్‌కె ఆర్ రోడ్ వేస్స్ ఆధీనంలో ఉంది. వరదతో వంతెన వద్ద రహదారికి ప్రమాదం ఏర్పడినా ఇప్పటి వరకు రాజీవ్ రహదారి నిర్మాణ సంస్థ (హెచ్‌కెఆర్) పరిశీలించలేదని పలువురు చెబుతున్నారు. బండరాళ్లు కొట్టుకపోవటంతో క్రమక్రమంగా అప్రోచ్ రోడ్డు కుంగిపోతోంది. భారీ వాహనాలు వెళితే రోడ్డు పూర్తిగా కుంగి గోదావరిలో కొట్టుకుపోతుంది. అప్పుడు పరిస్థితి ఏమిటని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వర్షాలు కురిసినా ఆ రోడ్డు కొట్టుకుపోతుందని పలువురు చెబుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టు సంస్థ, అధికారులు దీనిని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలు వెంటనే తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.