మీరు పోరాటం చేయండి.. మీ వెంట మేముంటాం..
-ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోవడం దారుణం
-పట్టాలు కావాలంటే చీరలు లాగుతారా..?
-కేసీఆర్‌కు మాటమీద నిలబడటం తెలియదు
-వైఎస్ఆర్ ఉంటే పట్టాలు మీ చేతుల్లో పెట్టేవారు
-కోయపోశగూడ బాధితులతో వైఎస్ షర్మిళ

మంచిర్యాల : ఈ భూములు మీవే.. మీరు పోరాటం చేయండి.. మీ వెంట మేముంటామని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ హామీ ఇచ్చారు. దండేపల్లి మండలం కోయపోశగూడెం రైతులతో వైఎస్ షర్మిళ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను బాధిత మహిళలు షర్మిళ దృష్టికి తీసుకువచ్చారు. మహిళలు అని చూడకుండా బట్టలు ఊడ దీసి కొట్టారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా షర్మిళ నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్నారని, ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వక పోవడం దారుణమని దుయ్యబట్టారు. వైఎస్సార్ బతికి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. వైఎస్సార్ పట్టాలను మీ చేతుల్లో పెట్టేవారని స్పష్టం చేశారు. ఆ భూములు తమవేనని 52 కుటుంబాలు ప్రతి ఏడాది పోరాటం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. జైల్లో పెట్టి మహిళలను చిత్ర హింసలకు గురి చేశారని అన్నారు. పాలు ఇచ్చే తల్లులను అని కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె సర్కారుపై ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో ఆడవారికి కనీసం రక్షణ లేదన్నారు. మనుషులు ఉండే సమాజం అని కూడా సర్కారు కు సోయి లేదని దుయ్యబట్టారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని కేసీఅర్ హామీ ఇచ్చారు కదా..? కుర్చీ వేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు కదా….? ఏమైందని ఆమె ప్రశ్నించారు. 8 ఏళ్లుగా ఒక్క ఎకరాకు కూడా పట్టాలు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకొలేని సర్కార్ ఎందుకు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పోడు పట్టాల పై కేసీఅర్ కొత్త మాట మాట్లాడుతున్నారని, పోడు చట్టాలు మార్చాలని చెప్తున్నారని ఇది ఎంత వరకు సమంజసమన్నారు. వైఎస్సార్ ఇదే చట్టం తోనే పోడు భూములకు పట్టాలు ఇచ్చారు.. మీకు ఇవ్వడం చేతకాదు అని చెప్పండి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పట్టాలు కావాలని అడిగితే చీరలు లాగుతారా..? ఇది మహాభారతమా..? ఇది దృతరాష్ట్ర పాలననా..? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కేసీఅర్ ను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పట్టాలు ఇవ్వాల్సి వస్తుందని… కాస్తు కాలాన్ని మార్చేశారని తెలిపారు. కేసీఆర్ ఓట్ల కోసమే బూటకపు హామీలు ఇచ్చారని అన్నారు. గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని కేసీఅర్ నమ్మిస్తాడని అన్నారు. 8 ఏళ్లలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. కేసీఅర్ కు మాట మీద నిలబడటం అంటే ఎంటో తెలియదన్నారు. పోడు పట్టాల కోసం పోరాడుతమని మరోమారు స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తున్నాయి…కేసీఅర్ మళ్ళీ వస్తాడని…ఈ సారి డబ్బులు బాగా ఇస్తాడు.. ఇచ్చినన్ని తీసుకోండి… మీ కోసం తపన పడే వారికి ఓటు వేయండి అని ఆమె పిలుపునిచ్చారు.