ఆదివాసులపై దాడులు మానవ హక్కుల ఉల్లంఘనే…
-అటవీ అధికారులపై కేసులు నమోదు చేయాలి
-జాతీయ మానవ హక్కుల కమిషన్ ను కలిసిన ఎంపీ సోయం బాపురావ్
పోడు భూముల సమస్యను సాకుగా చూపి తెలంగాణ ప్రభుత్వం అటవీ అధికారులు పోలీసుల చేత ఆదివాసులపై దాడులు చేయిస్తోందని ఎంపీ సోయంబాపురావ్ అన్నారు. ఈ సంఘటనలపై మానవ హక్కుల కమిషన్ స్పందించి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి వెళ్లి చైర్మన్ జస్టిస్ ఏకే మిశ్రా,సెక్రటరీ జనరల్ దేవేందర్ కుమార్ సింగ్లను ఎంపీ సోయం బాపురావ్ కలిశారు. తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యకు పరిష్కారం లభించడం లేదన్నారు. అటవీ అధికారులు ఫారెస్ట్ భూములను లాక్కొని ఆదివాసీ గూడేల నుంచి అడవి బిడ్డలను తరలించేందుకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోశగూడలో అడవి బిడ్డలపై ఫారెస్ట్, పోలీస్ అధికారులు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారని అన్నారు. పైగా అక్రమ కేసులు బనాయించారని ఎంపీ వివరించారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ పాత జిల్లాల పరిధిలోని ఏజెన్సీ భూముల్లో ఆదివాసులకు పట్టా ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు నిర్బంధ చర్యలు సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కోయపోశగూడలో 12 మంది మహిళలను జైలుకు పంపారని ఎంపీ వివరించారు. ఈ సంఘటనపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ జాతీయ చైర్మన్ జస్టిస్ కే.మిశ్రా సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ అమానుషంగా దాడులు చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై నివేదిక తెప్పించుకుంటామని బాధితులకు న్యాయం చేస్తామని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ తమకు హామీ ఇచ్చినట్టు ఎంపీ సోయం బాపురావు వివరించారు.