నిజంగానే కలిశారా…?
-మొదట విడివిడిగా.. ఆ తర్వాత కలివిడిగా..
-కలిసికట్టుగా ముందుకు సాగిన కాంగ్రెస్ నేతలు
-ద్వితీయ శ్రేణి నాయకులు, నేతల్లో ఆనందం
-ఎన్నికల వరకు ఇలాగే సాగుతారా..? అనే అనుమానాలు

మంచిర్యాల : కాంగ్రెస్ నేతలు అందరూ కలిశారు.. కలిసికట్టుగా అధినేత్రికి జరిగిన అన్యాయంపై గళమెత్తారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను ఉర్రూతలూగించారు. అయితే ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమేనా..? ఎన్నికల వరకూ కొనసాగుతుందా… అనే అనుమానాలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను ఈడీ విచారణకు పిలవడంతో పీసీసీ చీఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. భారీగా నేతలు, కార్యకర్తలు కూడా తరలివచ్చారు. మొత్తానికి అనుకున్న కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఇందులో జిల్లాలోని ముఖ్య నేతలంతా కలిసిరావడం ఆ పార్టీలో జోష్ నింపింది. అసమ్మతితో నేతలు అంతా ఎడమొహం, పెడమొహంగా ఉన్న నేతలు కలిసిరావడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌లో ఎన్నో ఏండ్లుగా గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. చాలా సందర్భాల్లో వారు రోడ్డుకు సైతం ఎక్కారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు.. అధిష్టానం జోక్యం.. చీవాట్లు.. ఇక్కడి నేతలకు కామన్. ఏ కార్యక్రమం జరిగినా రెండు వర్గాలు విడివిడిగా ఆ కార్యక్రమాలు నిర్వహించడం కూడా పరిపాటిగా మారింది. ఏ నేతకు చెందిన వర్గం ఆ నేత నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం కూడా మంచిర్యాల జిల్లాలో పరిపాటిగానే మారింది.
మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావుది ఒక వర్గం కాగా, మిగతా నేతలు ఒక వర్గంగా కొనసాగుతున్నారు. వాస్తవానికి శుక్రవారం నిర్వహించాల్సిన కార్యక్రమం రెండు వర్గాలు వేర్వేరుగా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. పోలీసులు సైతం రెండు వర్గాల్లో ఒకరికి ఐబీ చౌరస్తాలో, మరొక వర్గానికి బెల్లంపల్లి చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించాలని అనుమతులు ఇచ్చారు. అయితే, రాత్రికి రాత్రే సీన్ మారింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు మాజీ ఎమ్మెల్యే లు నల్లాల ఓదెలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ మంత్రులు బోడ జనార్దన్, వినోద్, సంజీవరావు, శ్రీదేవి, ఐ.ఎన్.టీ.యూ.సీ నాయకుడు జనక్ ప్రసాద్ తదితరులు అందరికీ ఫోన్లు చేసి అందరం కలిసి కార్యక్రమం చేద్దామని చెప్పారు. దీంతో వారు కూడా సరే అన్నారు.
అయితే, తన ఇంటికి వస్తే అక్కడ నుంచి ర్యాలీగా ఆందోళన కార్యక్రమం వేదిక వద్దకు వెళ్దామని ప్రేంసాగర్‌రావు చేసిన సూచనను ఆ నేతలు తిరస్కరించారు. స్టేజీ వద్దకు వేర్వేరుగానే వచ్చారు. అయితే నేతలు అందరూ కలిసి ఒకే వేదిక పంచుకోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఇలా ఎన్నికల వరకు కలిసి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అది సాధ్యం అవుతుందా..? అనే అనుమానాలు సైతం వారే వ్యక్తం చేయడం గమనార్హం. ఇక కొసమెరుపు ఏంటంటే… మధ్యలోనే ప్రేంసాగర్ రావు స్టేజీ దిగి వెళ్లిపోయారు. ఆయన అలా ఎందుకు వెళ్లిపోయారనే దానిపై సైతం కార్యకర్తల్లో గుసగుసలు వినిపించాయి.