ఒక్క రూపాయి డాక్టర్ కన్నుమూత
-అత్యధికంగా రోగులకు సేవలు అందించినందుకు వరల్డ్ రికార్డ్
-సంతాపం వ్యక్తం చేసిన మోదీ, దీదీ
రోగుల దగ్గర వీలున్నంత వరకు డబ్బులు గుంజి.. పెద్ద ఎత్తున సంపాదించాలనుకునే డాక్టర్లకు ఆయన పూర్తి వ్యతిరేకం. తన దగ్గరకు వచ్చే వారి దగ్గర కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకునే వైద్యుడతను. ఇప్పుడు ఆ వైద్య శిఖరం నేలకొరిగింది. ఒక్క రూపాయి డాక్టర్‌గా పేరొందిన ప్రముఖ వైద్యుడు సుషోవన్ బందోపాధ్యాయ్ 84 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు.
కేవలం రూపాయికే వైద్యం చేయడం, పేదలకు సాయం చేస్తున్న సుషోవన్ బందోపాధ్యాయ్ మరణించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుషోవన్ కిడ్నీ సమస్యతో రెండు సంవత్సరాలుగా బాధపడుతున్నారు. ఆయన కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 60 ఏళ్ల పాటు పేదలకు రూపాయికే వైద్యం అందించిన సుషోవన్ మరణవార్త విని అక్కడి ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు.
సుషోవన్‌ను దేశం 2020లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అత్యధిక సంఖ్యలో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా ఆయన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదైంది. 1984లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. ఆ తర్వాత తృణముల్ కాంగ్రెస్‌లో కొంత కాలం కొనసాగి రాజకీయాలకు వీడ్కోలు పలికారు. సుశోవన్ బందోపాధ్యాయ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు.
“డాక్టర్ సుషోవన్ బందోపాధ్యాయ మనందరికీ ఓ స్ఫూర్తి. ఓ గొప్ప హృదయం ఉన్న వారిగా.. ఎంతో మందికి వైద్య సేవలు అందించిన వ్యక్తిగా సుషోవన్ గుర్తిండిపోతారు. పద్మ అవార్డుల సమయంలో ఆయనతో కలిసిన క్షణాలు నేను గుర్తు చేసుకున్నాను. ఆయన మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బందోపాధ్యాయ మృతికి తీవ్ర సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.” సుషోవన్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఒక్క రూపాయి డాక్టర్‌గా పేరొందిన ఆయన.. ప్రజాస్ఫూర్తితో కూడిన దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం. నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.