బోథ్ ఎంపీపీపై అట్రాసిటీ కేసు నమోదు
-కులం పేరుతో దూషించాడని మార్కెట్ కమిటీ చైర్మన్ ఫిర్యాదు
-ఎమ్మెల్యే, ఎంపీపీ మధ్య కొద్ది రోజులుగా కొనసాగుతున్న వార్
-తమ నేతను రాజకీయంగా దెబ్బకొట్టేందుకే అని ఎంపీపీ అనుచరుల ఆరోపణ
ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎంపీపీ తులా శ్రీనివాస్‌పై అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఆయనపై మార్కెట్ కమిటీ చైర్మన్ భోజన్న తనను కులం పేరుతో దూషించాడని, కొట్టేందుకు ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన వారే కావడం కొసమెరుపు…
కొంతకాలంగా బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఎంపీపీ తులా శ్రీను మధ్య ప్రచ్ఛన యుద్దం సాగుతోంది. ఈ క్రమంలో అప్పటికే ఉన్న గ్రూపులకు తోడు అధికార పార్టీలో మరో జట్టు కట్టి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తులా శ్రీనివాస్ పని చేస్తున్నారని పలు మార్లు ఎమ్మెల్యే అనుచరులతో చెబుతూ వస్తున్నారు. మాజీ ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే జోగు రామన్న ఇద్దరూ శ్రీనివాస్ వెనక ఉన్నారని ఎమ్మెల్యే భావిస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలతో పాటు, అభివృద్ధి విషయంలో నిలదీసే వరకు వ్యవహారం వచ్చింది. ఈ నిరసనల వెనక తమ పార్టీకి చెందిన వారే అది కూడా తుల శ్రీనివాస్ చేయిస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు నేరుగా ఆరోపించారు.
ఉపాధి హామీలో బిల్లుల చెల్లింపులో జరిగిన అవకతకవలపై ఎంపీడీవోపై చర్యలు తీసుకునేంత వరకు సమావేశానికి రానంటూ బోథ్ ఎమ్మెల్యే బాపూరావు జడ్పీ సమావేశం బహిష్కరించడం కలకలం సృష్టించింది. ఆ తర్వాత ఎంపీడీవో ఏ తప్పు చేయలేదని, ఆమెపై చర్యలు తీసుకోవద్దంటూ ఏకంగా సమావేశ మందిరంలో ఎంపీపీ నేలపై బైఠాయించారు. అన్ని రోజుల పాటు తెర వెనక సాగిన వ్యవహారం బజారున పడింది. అప్పటి నుంచి వీరి మధ్య నువ్వా..? నేనా..? అన్నట్టుగా కొనసాగుతోంది. ఆ తర్వాత వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. మూడు రోజులుగా సోనాల మండలం ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా ఎమ్మెల్యే వర్గానికి నచ్చడం లేదు.
దీనికి తోడు తన నియోజకవర్గంలో నిరసనలు, ఆందోళనలు ఉండటం ఎమ్మెల్యేకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే నామినేట్ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపీపీపై కేసు నమోదు చేయడం రాజకీయంగా ఆయనను ఇబ్బందులకు గురి చేయడానికే అని ఎంపీపీ తుల శ్రీనివాస్ అనుచరులు ‘నాంది న్యూస్’కు తెలిపారు.