భారత్‌కు మూడో స్వర్ణ పతకం

Commonwealth Games 2022: భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు పతకాలు రాగా, అందులో అన్నీ వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలోనే కావడం గమనార్హం.
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022 లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. భారత వెయిట్ లిఫ్టర్ దేశానికి మరో స్వర్ణాన్ని అందించాడు. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 73 కిలోల విభాగంలో అచింత షెవులి.. దేశానికి మరో బంగారు పతకాన్ని సాధించిపెట్టాడు. 21 ఏండ్ల ఈ బెంగాల్ కుర్రాడు.. 313 కిలోల బరువును ఎత్తాడు. వెయిట్ లిఫ్టింగ్ 73 కిలలో ఈవెంట్ లో భాగంగా షెవులి.. బెంగాల్ బెబ్బులిలా గర్జించాడు. స్నాచ్ లో 143 కిలోలను ఎత్తిన అతడు.. క్లీన్ అండ్ జెర్క్ లో 170 కిలోలను అలవోకగా ఎత్తేశాడు. దీంతో మొత్తంగా 313 కిలోల బరువును ఎత్తాడు.
షెవులి స్వర్ణం భారత్‌కు పతకాల పట్టికలో ఆరోవది. ఇంతకుముందు మీరాబాయి చాను (49 కేజీల విభాగం), జెరీమా లాల్రిన్నుంగ (67 కేజీల విభాగం) లు స్వర్ణాలు సాధించారు. తాజాగా షెవులి కూడా ‘స్వర్ణ జాబితా’లో చేరాడు. ఈ ముగ్గురే గాక సంకేత్ సర్గార్ (55 కేజీల విభాగంలో) రజతం గెలవగా, బింద్యారాణి దేవి (మహిళల 55 కేజీల విభాగం)కూడా సిల్వర్ మెడల్ గెలిచింది. ఇక 61 కేజీల విభాగంలో కర్నాటకకు చెందిన గురురాజ పుజారి.. కాంస్యం నెగ్గాడు.