రంగు మార్చుకోనున్న స్ప్రైట్
అరవై ఏళ్ల తర్వాత స్ప్రైట్ తన లుక్ మార్చుకోనుంది. షాపులోకి వెళ్లగానే ఆకుపచ్చ రంగులో చూడగానే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇన్నేళ్లలో బాటిళ్ల ఆకారం మారినా.. స్ప్రైట్ ఉండే ఆకుపచ్చ రంగు మాత్రం మారలేదు. కానీ ఇప్పుడు ఆ ఆకుపచ్చ రంగుకు స్ప్రైట్ గుడ్ బై చెప్పేస్తోంది. ఇక ముందు దీని బాటిల్ సాధారణ పారదర్శక ప్లాస్టిక్ బాటిళ్లలో రానుంది. అసలే నీళ్లలా ట్రాన్స్ పరెంట్ గా ఉండే ఈ కూల్ డ్రింక్ ఇప్పుడు చూడటానికి సోడా బాటిళ్లలా కనిపించనుంది.
పర్యావరణ హితం కోసమే రంగు మార్చామని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. రీసైక్లింగ్ కు వీలుగా ఉండేలా రంగుల్లేని ప్లాస్టిక్ ను ఉపయోగించాలని నిర్ణయించడమే.. స్ప్రైట్ బాటిల్ రంగును మార్చడానికి కారణమని కోకకోలా సంస్థ ప్రకటించింది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే దీని బాటిల్ రంగును తొలగించినా.. దాని లోగో, మూత మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉండనున్నాయి. లోగోను మాత్రం కాస్తంత మార్చారు.
ప్రస్తుతానికి ఈ న్యూ లుక్ ను అమెరికాలో మార్చినట్టు కోకాకోలా సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దశల వారిగా అన్ని దేశాల్లోనూ దీన్ని అమలుచేస్తామని కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది.