ప్రాణహిత తీరంలో ముమ్మర తనిఖీలు
-అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి
-ప్రజల భద్రతనే పోలీసుల బాధ్యత : ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్
-కల్లంపల్లి గ్రామంలో పోలీసులు మీ కోసం

మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు ప్రాణహిత తీరంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక బలగాలు, పోలీసులతో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సోమవారం ఫెర్రీ పాయింట్లను ఇన్‌చార్జీ డీసీపీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులను పలు విషయాలపై ఆరా తీశారు. అంతేకాకుండా, పడవలు నడిపే వారు, చేపలు పట్టే వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేమనపల్లి మండలం కల్లంపల్లిలో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుపేదలకు బియ్యం, దుప్పట్లు, యువకులకు ఆట సామగ్రి పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ప్రజల భద్రత.. మా బాధ్యత అని వారికి స్పష్టం చేశారు. మావోయిస్టులు, అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సంఘవిద్రోహక శక్తులకు సహకరించి, యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కోరారు. పోలీసులు మీతో ఎలా ఉంటున్నారు..? గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఇన్‌చార్జీ డీసీపీ అఖిల్ మహాజన్ తో పాటు జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూర్ రూరల్ సీఐ విద్య సాగర్, నీల్వాయి ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు .