బాసర ట్రిపుల్ ఐటీ ఉపకార వేతనాలు మంజూరు చేయండి
బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంని కలిసిన ఆర్జీయూకేటి ఉపకులపతి వెంకట రమణ
బాసర ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఉపకార వేతనాలు మంజూరు చేయాలని ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జీ వీసీ వెంకట రమణ కోరారు. ఆయన హైదరాబాద్ సెక్రటేరియట్లో బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశంని కలిశారు. ఈ సందర్భంగా బాసర ఆర్జీయూకేటికి రావాల్సిన పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరారు. ఈ విషయంలో స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశంని తక్షణమే స్పందించి బీసీ విద్యార్థులకు సంబంధిత ఉపకార వేతనాలను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా నిర్మల్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సంబంధిత శాఖ, ఆర్జీయూకేటి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆ తర్వాత బాసర ఇన్‌చార్జీ వీసీ వెంకటరమణ చేపడుతున్న కార్యక్రమాలు, గ్రామీణ విద్యార్థుల సంక్షేమంపై తీసుకుంటున్న చొరవను ప్రిన్సిపల్ సెక్రటరీ బూర వెంకటేశం అభినందించారు. బీసీ సంక్షేమశాఖ నిధుల నుంచి ఆర్జీయూకేటి గ్రంథాలయానికి పుస్తకాల కోసం నిధులు మంజూరు చేయాలని వెంకట రమణ కోరగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుర్ర వెంకటేశం రచించిన ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ పుస్తకాలను వెంకటరమణకు అందించారు.