వరద బాధితుల పట్ల ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం

-పేద‌ల‌పై ప్ర‌భుత్వానికి ఎందుకు ఇంత వివ‌క్ష‌..?
-మూడు వారాలు అయినా ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్వే చేయ‌లేదు
-వ‌ర‌ద బాధితుల‌ను ప‌ట్టించుకోని ఎమ్మెల్యే దివాక‌ర్‌రావు
-బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆగ్ర‌హం

వ‌ర‌ద బాధితుల ప‌ట్ల ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు వెర‌బెల్లి ర‌ఘునాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న మంచిర్యాల‌లోని ఎన్టీఆర్ న‌గ‌ర్‌లో ఇంటింటికి వెళ్లి వ‌ర‌ద బాధితుల‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘునాథ్ మాట్లాడుతూ వరదలు వచ్చి మూడు వారాలు దాటిన వరద బాధితులకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా జమ చేయలేదన్నారు. కనీసం ఇప్పటి వరకు ఎంత నష్ట జరిగిందనే విష‌యంలో అధికారులు సర్వే కూడా చేయలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌భుత్వం పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ని కలిసి వరద బాధితులు, పంట పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశార‌ని గుర్తు చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు మాత్రం ఇంత వరకు ముఖ్యమంత్రిని కలవకుండా కాలయాపన చేస్తున్నార‌ని అన్నారు. క‌నీసం బాధితులను ఆదుకోవాలనే సోయి కూడ ఈ ఎమ్మెల్యేకు లేద‌ని విమర్శించారు.

ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి కేసిఆర్ జిల్లా పర్యటనకు వచ్చి బాధిత కుటుంబాలను అదుకుంటారని అన్నారు. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కూడా కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్ట పోయిన రైతులను ఆదుకోవాలనే సోయి లేకుండా మునుగోడు లో రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సర్వే నిర్వహించి వరద బాధితులను తక్షణమే 10వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలన్నారు. జిల్లాకు 5 కోట్ల రూపాయల వరద ప్యాకేజీ ప్రకటించాల‌ని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. వరద బాధితులను ఆదుకోక‌పోతే ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఇత‌ర బీజేపీ నేత‌లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like