కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తోంది
మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డివిరిచేలా ధరలు పెంచుతోందని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల ఐబి చౌరస్తాలో పెరిగిన నిత్యావసర ధరలు, జీఎస్టీ పెంపు తదితర అంశాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. నిత్యావసర సరుకులు మొదలుకొని పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచిందని ధ్వజమెత్తారు. చివరకు చిన్న పిల్లలు రాసుకునే పెన్సిల్, ఏరేజర్ ధరలు కూడా పెంచారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా సామాన్యులకు ఆర్థిక భారం కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల సామాన్యులకు శిరోభారంగా మారిందన్నారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే లోతట్టు ప్రాంతాలు నీటి మునుగుతున్నాయని తెలిపారు. మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.