బాసర త్రిపుల్ ఐటీ వంటశాలలో స్నానాలు..
-ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
-నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు
బాసర త్రిపుల్ ఐటీని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. అధికారులు తాము చేయాల్సిందంతా చేస్తున్నామని బయటికి చెబుతున్నా… చేతల్లో మాత్రం అలాంటిది ఏమీ కనిపించడం లేదు.
ఓ వైపు ఫుడ్ పాయిజన్, విద్యార్థుల ఆందోళన.. అన్ని పరిశీలిస్తున్నట్లు అధికారుల సందేశాలు.. ఇవన్నీ జరుగుతున్నా ట్రిపుల్ ఐటీ సిబ్బందిలో మార్పు రావడం లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఎన్నో రోజులుగా ట్రిపుల్ ఐటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అధికారులు నా మాత్రపు తనిఖీలు నిర్వహించడం మినహా ఏమీ చేయడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా… ట్రిపుల్ ఐటీ కళాశాలలోని మెస్ లలో ఉన్న వంటశాలలో స్నానం చేస్తూ అక్కడి సిబ్బంది కెమెరాకు చిక్కారు. ఆ వీడియోలో పక్కనే వంటలు వండుతూ అక్కడే స్నానాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. వంట చేసే సిబ్బంది శుభ్రత పాటించకపోవడం, వంటశాలలో స్నానాలు చేయడం వల్లనే తరచూ ఫుడ్ పాయిజన్ కారణం అవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ అధికారులు విషయం తెలియడంతో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని సమాచారం. మరోవైపు ఈ వ్యవహారం బయటకు రాకుండా చేస్తున్నారని పలువురు దుయ్యబడుతున్నారు.
అధికారులు వెంటనే మెస్ కాంట్రాక్టు రద్దు చేయాలని.. వారి పైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు..