అన్ని కార్మిక సంఘాలను పిలవండి
సింగరేణి సీఅండ్ఎండీకి ఆర్ఎల్‌సీ లేఖ
సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేంత వరకు అన్ని కార్మిక సంఘాలను చర్చలకు పిలవాలని సింగరేణి సీఅండ్ఎండీకి రీజినల్ లేబర్ కమిషనర్ లేఖ పంపించారు. 2017 అక్టోబరు 5న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘ ఎన్నికలు జరగగా తిరిగి 2019లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. యూనియన్ గుర్తింపు కాలం ముగిసి ఏడాది అవుతున్నా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో రీజినల్ లేబర్ కమిషనర్‌ను బుధవారం కార్మిక సంఘ నేతలు కలిశారు. INTUC నేత జనక్ ప్రసాద్, AITUC నేత సీతారామయ్య, HMS నేత రియాజ్ అహ్మద్, CITU నేత రాజిరెడ్డి కలిసి పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. సింగరేణిలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికలు పెట్టెంత వరకు అన్ని కార్మిక సంఘ నాయకులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. సీఎల్‌సీ గుర్తింపు సంఘానికి 2 సంవత్సరాల కాలపరిమితి ఇచ్చినా, గుర్తింపు అయి పోయి రెండు సంవత్సారాలు దాటుతోందని అయినా ఎన్నికలు పెట్టడం లేదని ఆరోపించారు. దీనిపై రీజినల్ లేబర్ కమిషనర్ స్పందించి ఎన్నికలు పెట్టేంత వరకు అన్ని కార్మిక సంఘాల నాయకులని పిలవాలని సింగరేణి C&MD గారికి లేఖ రాశారు. ఆ లేఖ కాపీని కార్మిక సంఘాల నాయకులకు ఇచ్చారు.