ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తా
-బాసర ట్రిపుల్ ఐటీలో చాలా సమస్యలు ఉన్నాయి
-విద్యార్థుల డిమాండ్లు అన్ని నెరవెర్చేటివే..
-విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అన్నిరకాలుగా కృషి
-విలేకరుల సమావేశంలో గవర్నర్ తమిళ్ సై
బాసర ట్రిపుల్ ఐటీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటి పరిష్కారానికి అన్ని రకాలుగా కృషి చేస్తానని తెలంగాణ గవర్నర్ తమిళ్ సై స్పష్టం చేశారు. ఆమె ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటించారు. విద్యార్థులు, అధికారులతో మాట్లాడి వారితో చర్చించారు. ఈ సందర్భంగా బాసర త్రిపుల్ ఐటీ గేటు బయట మీడియాతో మాట్లాడిన గవర్నర్ పలు విషయాలు వెల్లడించారు.
ట్రిపుల్ ఐటీలో అన్ని విభాగాలను పరిశీలించానని విద్యార్థులు, ఉద్యోగులతో సైతం మాట్లాడినట్లు వివరించారు. ఇక్కడి సమస్యలు సైతం తెలుసుకున్నానని స్పష్టం చేశారు. 2017 నుండి ల్యాప్టాప్స్ ఇవ్వలేదని వెల్లడించారు. ఇక ఇక్కడ మెస్ సమస్య ప్రాథమికమైనదిగా భావిస్తున్నానని గవర్నర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, సెక్యూరిటీ, లైబ్రరీ సమస్యలు సైతం గమనించానని అన్నారు. సమస్యల పరిష్కారంలో సంబంధిత అధికారులను ఒత్తిడి చేస్తానని మరోమారు వెల్లడించారు.
సమస్యల పరిష్కారానికి నా పరిధిలో ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా గవర్నర్ హామీ ఇచ్చారు. మరణించిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంజయ్ కిరణ్ కుటుంబానికి నా తరపున సహాయం చేస్తానని తమిళ్ సై హామీ ఇచ్చారు. క్యాంపస్ లో పోలీసులు భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారని నేను ఈ విషయాన్ని నేను ఇంచార్జీ విసి కి చెప్పానని వెల్లడించారు. విద్యార్థుల డిమాండ్లు చాలా సింపుల్ ఉన్నాయని, అన్ని డిమాండ్లు నెరవేర్చ దగ్గవేనని స్పష్టం చేశారు.
విద్యార్థులకు నా వంతుగా మోరల్ సపోర్ట్ ఇచ్చానని ఆమె చెప్పారు. లైబ్రరీలో సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని, ఆటలకు సంబంధించిన ఎలాంటి ఆక్టివిటీస్ లేవన్నారు. అమ్మాయిలకు భద్రత విషయంలో సైతం కొంత సమస్య ఉన్నట్టు తెలిసిందన్నారు. ఇక ఇక్కడ సిబ్బంది కొరత చాలా ఉందని ఆమె వెల్లడించారు. విద్యార్థులకు మంచి హైజనిక్ నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. రెగ్యులర్ గా పిల్లలకు మెడికల్ చెకప్ చేయాలన్నారు. ఈ రోజు నుండి ఒక్కో సమస్య తీరుతుందన్న నమ్మకం ఉందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మెస్ ల విషయంలో పిల్లలు సంతోషంగా లేరని తమిళ్ సై స్పష్టం చేశారు. ఇవాళ నేను వచ్చానని మంచి బ్రేక్ ఫాస్ట్ పెట్టారు.. మీరు రోజు వస్తే మంచి భోజనం దొరుకుతుందని విద్యార్థులు అన్నారని ఇది చాలా బాధాకరమని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో ప్రొటోకాల్ ఇమలు అంశం అందరికీ తెల్సిన ఓపెన్ సీక్రెట్ అని చెప్పారు. రాష్ట్రంలో గవర్నర్ కి ఇస్తున్న ప్రోటోకాల్ అందరికి తెలుసునని అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పోస్టుకి అధికారులు గౌరవం ఇవ్వాలన్నారు.