పోలీసులు కావాలనే చేశారా..?
గవర్నర్ తమిళ్‌సై బాసర ట్రిపుల్ ఐటీ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అడుగడునా మీడియాను అడ్డుకోవడమే కాకుండా, వారిపై ఆంక్షలు విధించారు. పోలీసులు కావాలనే ఈ విధంగా ప్రవర్తించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకానొక దశలో గవర్నర్ పర్యటన కవర్ చేయకుండా మీడియా ప్రతినిధులను తోసేసే ప్రయత్నం చేశారు. దీంతో ఏకంగా గవర్నర్ కల్పించుకుని మీడియాను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. తాను సేఫ్‌గానే ఉన్నానని ఆమెనే కల్పించుకుని మీడియాను అనుమతించారు. ఇక గవర్నర్ నిర్వహించే ప్రెస్‌మీట్ సైతం రోడ్డుపైన ఏర్పాటు చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
గవర్నర్ తమిళ్ సైకి సాధారణ స్వాగతమే లభించింది. ఆదివారం ఉదయం ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రైలులో వచ్చిన ఆమె.. నిజామాబాద్ లో దిగి అక్కడ నుంచి కారులో ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. ఆమెకు ట్రిపుల్ ఐటీ ఇంచార్జ్ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, అడిషనల్ కలెక్టర్ రాంబాబు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు స్వాగతం పలికారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముష్రాఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర గవర్నర్ తమిళి సై పర్యటనకు దూరంగా ఉన్నారు.
అంతకు ముందు గవర్నర్ సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కుంకుమ పూజ, మహాహారతి నిర్వహించారు. అమ్మవారి చరిత్రను వేద పండితులను అడిగి తెలుసుకున్నారు. ఆలయం తరఫున ఈవో సోమయ్య గవర్నర్‌ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.