ఆదివాసీ విద్యార్థిని మృతి

ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఓ ఆదివాసీ విద్యార్థిని మృతి చెందింది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆత్రం కవిత అనే ఆదివాసీ విద్యార్థిని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేజీబీవీలో 10వ తరగతి చదువుతోంది. కవితకు జ్వరం వస్తుండగా, రెండు రోజుల కిందట రిమ్స్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది.
ఆమెకు జ్వరం వస్తున్న విషయం కానీ, కవితకు చికిత్స అందిస్తున్న విషయం కానీ ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించలేదు. మరణించిన తర్వాత తల్లిదండ్రులకు విషయం చెప్పి ఆమె స్వగ్రామం ఉట్నూర్ మండలం జెండగూడ గ్రామనికి తరలించారు. తమ బిడ్డ కవిత మృతిపై తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని బాలిక మృతి పై పలు అనుమానాలను తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. బాలిక మృతదేహంతో ఐటిడిఎ ముందు ధర్నా చేపడుతామని హెచ్చరించారు. దీంతో ఈ విషయంలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామని బాలిక తల్లిదండ్రులు, బంధువులకు ఐటీడీఏ అధికారులు భరోసా ఇచ్చారు.