ఈ పెళ్లి… ఆపండి…
-ఆగిపోయిన పీటల మీద పెండ్లి
-తనను మోసం చేశాడని పెండ్లికొడుకుపై యువతి ఆరోపణ
-కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పెళ్లిపీటల మీద కళ్యాణతంతు జరుగుతోంది… ఓ వైపు బ్యాండ్ మేళం.. మరోవైపు బంధువుల హడావిడి.. వేదపండితుల మంత్రోచ్ఛరణ కొనసాగుతోంది. ఇంతలో ఈ పెళ్లి.. ఆపండి.. అంటూ సినిమా సిన్ ని తలపించే విధంగా ఓ అమ్మాయి పెండ్లి మంటపంలోకి వచ్చింది. దీంతో అప్పటి వరకు హడావిడిగా ఉన్న పెళ్ళిమండపం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది.
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలోని బీమా గార్డెన్‌లో పెండ్లిపీటల మీద పెండ్లి ఆగిపోయింది. గద్దెరాగడికి చెందిన బొద్దుల రాజేష్ ను వరంగల్ కి చెందిన అనూష అనే అమ్మాయితో పెండ్లి నిశ్చయం అయ్యింది. బుధవారం వీరి పెండ్లి జరుగుతుండగా, తాళి కట్టే సమయానికి హుజూరాబాద్ కు చెందిన రమీనా అనే అమ్మాయి వచ్చి పెండ్లి అడ్డుకుంది. తనకు రాజేష్‌కు మధ్య ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిపింది. తమ ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా గతంలో అబార్షన్ కూడా చేయించడానికి రమీనా వెల్లడించింది.
తాను హన్మకొండలో ఫార్మసీ చదువుతున్న సమయంలో ప్రేమిస్తున్నానని చెప్పి తనను యాదగిరి గుట్టకు తీసుకువెళ్లి శారీరకంగా వాడుకున్నాడని వెల్లడించింది. రాజేష్ వివాహం జరుగుతున్న విషయాన్ని చెప్పకుండా నిన్నటి వరకు చాటింగ్ చేశాడని స్పష్టం చేసింది రమీనా. వాళ్ళ బంధువులు వాట్సప్ లో పెట్టుకున్న స్టేటస్ చూసి పెళ్ళీ జరుగుతున్న ఫంక్షన్ హాల్ కు వచ్చి వివాహాన్ని ఆపేందుకు ప్రయత్నం చేశానని వెల్లడించింది. తన వద్ద ఫోన్లో ఉన్న ఆధారాలను చూపిస్తున్న సమయంలో ఫోన్ తీసుకొని రాజేష్ వాళ్ళ అమ్మ , నాన్న, సోదరుడు వచ్చి తనపై దాడి చేశారని రమీనా ఆవేదన వ్యక్తం చేసింది. రాజేష్ తో వివాహం జరిపించాలని, లేకపోతే చనిపోతానని యువతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.