పురుగుల మందుతో వంట.. తిని ఒకరు మృతి…
మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ పురుగులమందుతో వంట చేసింది. మంచినూనె అనుకుని పురుగుల మందు పోసి కూర వండింది. ఆ తర్వాత అన్నంలో కలుపుకుని తిన్నది. తాను తినడమే కాక భర్తకు, కూతురికి సైతం వడ్డించింది. ఈ క్రమంలో ఆమె మృత్యువాత పడింది. భర్త కూడా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లా మేడిద పల్లిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి…
బండ్ల నాగమ్మ (37) మతిస్థిమితం లేక ఇబ్బంది పడుతోంది. ఇంట్లో మంచి నూనెకు బదులు దాని పక్కనే ఉన్న పురుగుల మందుతో కూర వండింది. ఆ తర్వాత ఆ కూరతో తాను అన్నం తిని, చేలో పనిచేస్తున్న భర్త పుల్లయ్య, కూతురు పల్లవిలకు భోజనం తీసుకు వెళ్ళింది. మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య కొంతమేర అన్నం తిన్నాడు. మందు వాసన రావడంతో అమ్మాయి అన్నాన్ని పడేసింది. నాగమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.