ఐయామ్ సారీ..
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పీసీసీ చీఫ్ క్షమాపణలు

ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డు అనే పదం ప్రస్తావన, మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై పరుషపదజాలంతో మాట్లాడటంపై తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ట్విట్టర్లో వీడియో సైతం పోస్టు చేశారు. పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. ఐక్యమత్యమే పార్టీకి బలం అని అన్నారు. ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవరికి మంచిది కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కోమట్రెడ్డి వెంకట్‌రెడ్డిని ఇలా అవమానించే విధంగా ఎవరూ మాట్లాడినా సరికాదన్నారు. తదుపరి క్షమశిక్షణా చర్యల కోసం క్షమశిక్షణా చైర్మన్ చిన్నారెడ్డిని కోరుతున్నామని రేవంత్ స్పష్టం చేశారు.
నేడు మునుగోడులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పాదయాత్ర చేయనున్నారు. నారాయణపూర్‌లో పాదయాత్ర ప్రారంభించి గుడిమల్కాపూర్, తంగడపల్లి మీదుగా చౌటుప్పల్ వరకు సాగనుంది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆజాదీ కా గౌవర్ యాత్రలో భాగంగా ఈ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. చౌటుప్పల్ సభలో నిర్వహించే సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతారు. ఆయన పర్యటన నేపథ్యంలో కోమట్రెడ్డి వెంకట్ రెడ్డికి సారీ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.