మున్సిపల్ చైర్ పర్సన్ కంటతడి
-నన్ను, నా భర్తను భయపెడుతున్నారు
-ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన

చైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ఇప్పటి వరకు తనకు అవమానాలు తప్ప ఏం లేదని మున్సిపల్ చైర్పర్సన్ కంటతడి పెట్టారు…. తనను, తన భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మీడియా సమక్షంలోనే ఆమె బోరున విలపించారు. దీనికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేనే బాధ్యుడని ఆమె స్పష్టం చేశారు..
అన్నా… మల్లన్న ఒక సోదరిగా వేడుకుంటున్నా… ఓ మహిళపై కక్ష కట్టి నన్ను నా భర్తను అవమానిస్తున్నారు.. మాకు మనశ్శాంతి లేకుండా చేయకండి అన్నా అంటూ సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష కన్నీటి పర్వతమయ్యారు. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తమను కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ప్రజా ప్రతినిధిగా, పట్టణ ప్రథమ పౌరురాలిగా గాంధీ పార్కులో జరిగే వేడుకలకు హాజరు కాగా తనను నెట్టివేసి అవమాన పరచడం చాలా బాధాకరంగా ఉందన్నారు. నా విధులు నిర్వహించుకోకుండా సొంత పార్టీ వారు సైతం అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా తమకు ప్రతిసారి అడ్డు తగులుతున్నారని ఆరోపించారు .
తమకు ఏ మాత్రం విలువ లేకుండా చేస్తూ ప్రేక్షక పాత్రకే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణం లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో తమ ఫోటోలు వేయకుండా కించపరుస్తున్నారని అన్నారు. తనకు తన భర్త తోడుగా వస్తుంటే తన భర్తను రానివ్వకుండా అడ్డుకోవడం చాలా బాధాకరం అన్నారు. భర్తగా భార్యకు తోడు రావడం తప్పా.. అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి తాను అనుభవిస్తున్న మానసిక క్షోభ అర్థం చేసుకొని మా విధులను సక్రమంగా నిర్వహించే విధంగా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.