గోదావరిఖనిలోనే సీఎంపీఎఫ్ కార్యాలయం

-హైదరాబాద్‌కు తరలించాలన్న ప్రతిపాదన తిరస్కరించిన బోర్డు ఆఫ్‌ ట్రస్టీలు
-ఫలించిన సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు
-వేలాది మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు మేలు
-పింఛన్‌ నిధి పటిష్టానికి టన్ను బొగ్గుపై మరో 5 రూపాయలు జమ చేసేందుకు ఏకగ్రీవ తీర్మానం
-డైరెక్టర్ ఎన్‌.బలరామ్‌ వెల్లడి

సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్‌ కార్మికులకు సింగ‌రేణి యాజ‌మాన్యం శుభవార్త చెప్పింది. గోదావరిఖనిలో ఉన్న సీఎంపీఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలించాలన్న ప్రతిపాదనను సీఎంపీఎఫ్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీలు తిరస్కరించారు. ఈ మేరకు మంగళవారం నాగ్‌పూర్‌లో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనీల్‌ కుమార్‌ జైన్‌ అధ్యక్షతన జరిగిన బోర్డు ఆఫ్‌ ట్రస్టీల సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

వేలాది మంది సింగరేణీయులకు అందుబాటులో ఉన్న ఈ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలించాలంటూ బోర్డు ఆఫ్‌ ట్రస్టీ ల సమావేశంలో అజెండాలో ఉంచారు. దీనిపై తక్షణమే స్పందించిన సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్‌ బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని బొగ్గు గనుల్లో పనిచేస్తున్న 35,000 మంది ఉద్యోగులు, ఇక్కడే స్థిరపడిన సుమారు 50 వేల మంది రిటైర్డ్ కార్మికుల‌కు అందుబాటులో ఉన్న సీఎంపీఎఫ్‌ ఆఫీస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదన తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. సింగరేణిలోని కార్మిక సంఘాలు కూడా ఈ కార్యాలయాన్ని గోదావరిఖనిలోనే కొనసాగించాలని కోరాయి.

ఈ అంశంపై నాగ్‌పూర్‌లో జరిగిన బోర్డు ఆఫ్‌ ట్రస్టీల సమావేశంలో చర్చకు వచ్చిన వెంటనే సమావేశంలో సింగరేణి తరఫున హాజరైన డైరెక్టర్‌ (పర్సనల్‌, ఫైనాన్స్‌) ఎన్‌.బలరామ్ గోదావరిఖనిలోనే కార్యాలయాన్ని కొనసాగించాలని కోరారు. కార్యాలయం అందుబాటులో ఉంటే కలిగే లబ్ధిని, తరలించడం వల్ల తలెత్తే ఇబ్బందులను ట్రస్టీలకు కూలంకషంగా వివరించారు. ఈ అంశంపై సమావేశంలో పాల్లొన్న కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, బీఎంఎస్‌, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

ఈ సందర్భంగా సీఎంపీఎఫ్‌ అధికారులు మాట్లాడుతూ గోదావరిఖని కార్యాలయానికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై సహకారం కావాలని కోరగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని డైరెక్టర్‌ (పర్సనల్‌) ఎన్‌.బలరామ్‌ పేర్కొన్నారు. అనంతరం ట్రస్టీలందరూ గోదావరిఖనిలోనే కార్యాలయాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

బొగ్గు సంస్థల్లో పదవీ విరమణ పొందిన కార్మికులకు చెల్లించే పెన్షన్‌ నిధిని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో దేశంలో ఉత్పత్తి అవుతున్న ప్రతీ టన్ను బొగ్గుపై మరో 5 రూపాయలను పింఛన్‌ నిధికి జమ చేయాలని ట్రస్టీలందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రస్తుతం టన్ను బొగ్గుపై రూ.10 జమ చేస్తుండగా తాజా నిర్ణయంతో ఇకపై ఉత్పత్తి అవుతున్న టన్ను బొగ్గుపై రూ.15 జమ చేయనున్నారు. దీనివల్ల సంక్షోభంలో ఉన్న పింఛన్‌ నిధికి కొంత ఆర్థిక పరిపుష్టి చేకూరుతుంది. బోర్డు ఆఫ్‌ ట్రస్టీలు ఏకగ్రీవంగా అంగీకరించిన ఈ ప్రతిపాదన బొగ్గు మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. అనంతరం ఇది అమలులోకి వస్తుంది.

బోర్డు ఆఫ్‌ ట్రస్టీల సమావేశంలో కోలిండియా ఛైర్మన్ ప్రమోద్‌ ఆగర్వాల్‌, బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శినిరూపమ కొట్ట్రూ, కోలిండియా డైరెక్టర్‌ (పర్సనల్‌) వినయ్‌ రంజన్‌ మిశ్రా, డబ్ల్యు.సి.ఎల్‌. డైరెక్టర్‌ (పర్సనల్‌) సంజీవ్‌ కుమార్‌, డబ్ల్యు.సి.ఎల్‌. జీఎం (పర్సనల్‌) నరేంద్ర కుమార్‌, కోలిండియా అనుబంధ సంస్థల డైరెక్టర్లు, సింగరేణి జీఎం (పర్సనల్‌) ఐఆర్‌, పీఎం ఎ.ఆనందరావు, సి.ఎం.పి.ఎఫ్‌. కమిషనర్ విజయ్‌ కుమార్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like