సమస్యల నిలయం.. సఖీ కేంద్రం..
-వాహన సౌకర్యం లేక నానా ఇబ్బందులు
-అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ సౌకర్యం
-సిబ్బంది లేక తప్పని ఇబ్బందులు
-ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్న బాధితులు

బాధిత మహిళలకు అండగా నిలవాల్సిన సఖీ కేంద్రం సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. సరైన వసతులు లేకపోవడంతో ఇక్కడకు వచ్చే వారు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడంతో బాధితులకు సరైన సౌకర్యాలు అందడం లేదు. మరోవైపు సఖి కేంద్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా, దాని గురించి కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో ఈ సఖి కేంద్రం ఉంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
బాధిత మహిళలు ఎక్కడ ఉన్నా, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా సఖి కేంద్రం అండగా నిలుస్తుంది. అన్యాయానికి గురైన వారికి భరోసా ఇస్తుంది. గృహహింస, వరకట్న వేధింపులు, అత్యాచార ఘటనలు లాంటివి ఏవి చోటు చేసుకున్నా.. హెల్ప్‌లైన్ 181కు ఫోన్‌చేస్తే, తక్షణమే వారికి సాయం చేయడానికి ముందుకు వస్తుంది. రాష్ట్రప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖద్వారా జిల్లా కేంద్రాల్లో సఖి కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, మంచిర్యాల జిల్లాలో మాత్రం సఖి కేంద్రమే సమస్యల్లో చిక్కుకుని ఉంది. దాని గురించి కనీసం పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం కూతవేటు దూరంలోనే ఈ సఖి కేంద్రం ఉంది. బాధితులకు అండగా నిలబడాల్సి ఉండగా, దాంట్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఈ సఖి కేంద్రానికి వాహన సౌకర్యం లేకపోవడంతో బాధితులను తరలించడం చాలా ఇబ్బందిగా మారింది. దాదాపు మూడు నెలలుగా వాహనం లేదు. అయినా దీని గురించి సిబ్బంది కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ సైతం చాలా దారుణంగా తయారయ్యింది. అక్కడ నీరు లీకై పైకి వస్తోంది. దీంతో దుర్వాసన వస్తోంది. దోమలు, క్రిమికీటకాలతో ఇక్కడకు వచ్చే బాధితులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
సిబ్బంది కూడా సరిగా లేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు ఉండాల్సి ఉండగా ఇద్దరూ లేరు. దీంతో ఉన్న సిబ్బందిలోనే సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు. రాత్రిపూట కూడా మహిళా సిబ్బందే సెక్యూరిటీ విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ఇద్దరు పారామెడికల్ సిబ్బందికి ఒక్కరే ఉన్నారు. మల్టీ పర్సస్ హెల్త్ వర్కర్ ఇద్దరికి, ఒక్కరే ఉన్నారు. కేసు వర్కర్ సైతం కేవలం ఒక్కరే ఉన్నారు. ఇలా సిబ్బంది సైతం సరిగ్గా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చుట్టూ కంపౌడ్ వాల్ సైతం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్న సిబ్బందే డబుల్ విధులు చేయాల్సి ఉంటోంది ఈ విషయంలో అధికారులు పట్టించుకోక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సఖి కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.