ఇంటి నిర్మాణ సామగ్రి అందచేత
వరద బాధిత కుటుంబాలకు రేకులు, సిమెంట్ బస్తాలు, పైపులు అందించిన ఎరబెల్లి రఘునాథ్

వరద బాధిత కుటుంబాలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎరబెల్లి రఘునాథ్ ఇంటి నిర్మాణ సామగ్రి అందించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్‌లో గత నెల వచ్చిన వరదల కారణంగా ఇండ్లన్నీ పాడయ్యాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తరఫున సైతం వారికి ఎలాంటి సాయం అందలేదు. ఈ నేపథ్యంలో 65 ఇండ్ల పునర్నిర్మాణం కోసం కావాల్సిన సామాగ్రి రేకులు, సిమెంట్ బస్తాలు, పైపులు ఇండియా డెవలప్మెంట్ అండ్ రిలీఫ్ ఫండ్ స్వచ్ఛంద సంస్థ, దాతల సహకారంతో బాధితులకు అందించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ వరదల వల్ల దెబ్బతిన్న 100 ఇండ్లకు తమ వంతు సాయంగా ఇంటి సామగ్రి అందిస్తున్నట్లు వెల్లడించారు. రేకులు, పైపులు, సిమెంట్, ఇటుకలు అందించి ఆయా కుటుంబాలకు తమ వంతు సాయం అందించామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 65 కుటుంబాలకు ఇంటి నిర్మాణ సామగ్రి అందించామని తెలిపారు. పూర్తిగా ఇండ్లు కూలిన కుటుంబాలకు కూడా త్వరలోనే సహకారం అందిస్తామన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన దాతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పురుషోత్తం జాజు, మున్న రాజా సిసోడియా, రజీనిష్ జైన్, కృష్ణ భాస్కర్, ఆనంద్ రావు, వొడ్నాల లక్ష్మీ నారాయణ, విశ్వేశ్వర్ శర్మ, జోగుల శ్రీదేవి, బోయిని హరికృష్ణ, గాజుల ప్రభాకర్, అమిరిషెట్టి రాజు, పల్లి రాకేష్, బోడకుంట ప్రభ, రంగ శ్రీశైలం, బుద్దరపు రాజమౌలి, అవిడపు రాజబాబు, అశోక్, బోయిని దేవేందర్ పాల్గొన్నారు.