కాంగ్రెస్ పాదాభివందనం
-మునుగోడులో లక్ష మందికి పాదాభివందనం చేయనున్న కాంగ్రెస్ నేతలు
-దిశానిర్దేశం చేసిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
నేటి నుంచి మునుగోడులో ‘ప్రజాస్వామ్యానికి పాదాభివందనం’ కార్యక్రమం నిర్వహించనుంది. దీనిలో భాగంగా నియోజకవర్గంలోని లక్ష మంది ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పాదాభివందనం చేస్తుంది. ఈ మేరకు పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మునుగోడులో టీఆర్‌ఎస్, బీజేపీ భారీఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వేరే పార్టీల నాయకులను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని కాం గ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అందుకే శనివారం నుంచి వెయ్యి మంది నేతలు.. ఒక్కొక్కరు వంద మంది ఓటర్లను కలిసి పాదాభివందనం చేయాలని రేవంత్ సూచించారు. పార్టీ ముఖ్య నేతలు, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. నేతలు ఇంటింటికీ తిరిగి ఓటరుకు పాదాభివందనం చేయాలని, బీజేపీ, టీఆర్ఎస్ దుర్మార్గాలను వివరించి చెప్పాలని రేవంత్ సూచించారు. తాను కూడా మునుగోడులో తెలంగాణ సమరయోధుల కుటుంబాలను కలిసి వందనాలు చేస్తానని తెలిపారు.