రాజీవ్ చొరవతోనే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు
రాజీవ్‌గాంధీ చొరవ వల్లనే మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా కార్యదర్శి దేవరాజుల సుప్రజ అన్నారు. రాజీవ్ గాంధీ (Rajiv gandhi) జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం డిజిటల్ రంగంలో నేడు ముందుకు పోతుందంటే ఆనాడు రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని పరిచయం చేసి అభివృద్ధి చేయడమే కారణమన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వాణిజ్య వ్యాపార రంగాలలో అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడారు.
చిన్న వయస్సులోనే రాజీవ్‌గాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని ,ఆయన చేపట్టిన సంస్కరణలు చరిత్రలో నిలిచిపోయాయని అన్నారు.యువతకి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు.రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాక దేశ చరిత్రలో కొత్త రికార్డులు నెలకొల్పారని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయాలను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
అనంతరం తిరుపతి రుయా (SVRR) ఆసుపత్రి లోని చికిత్స విభాగంలో రోగులకు పండ్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో NSUI సిటీ అధ్యక్షుడు షేక్ జావేద్ ,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.