కేసీఆర్ సర్కార్ ని గద్దె దించడమే లక్ష్యం

-ఇది రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వం
-బూటకపు హామీలకు పెట్టింది పేరు
-కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ఏటీఎంలా మారింది
-బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వ‌జం

కేసీఆర్ సర్కార్ ని గద్దె దించడమే మన లక్ష్యం, ఈ సర్కార్‌ను పడగొట్టేందుకే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి చేరారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. బీజేపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ మునుగోడు సమరభేరిలో ఆయ‌న టీఆర్ఎస్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. కేసీఆర్ అవినీతి సర్కారు మాయమైపోతుంద‌ని చెప్పారు. ఇదో అబద్ధాల కోరు ప్రభుత్వం అంటూ దుయ్యబట్టారు. తాము గెలిస్తే సెప్టెంబర్ లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తానన్న కేసీఆర్ మాట తప్పారని అమిత్ షా మండిపడ్డారు. మజ్లిస్ పార్టీకి భయపడే కేసీఆర్ ఆ హామీ అమలు చేయలేదని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని జరిపిస్తామని అమిత్‌షా ప్రకటించారు.

పేదవారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేసీఆర్‌ ఇచ్చారా?. నిరుద్యోగులు రూ.3 వేలు ఇస్తామని కేసీఆర్‌ మాట తప్పారని అన్నారు. ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ప్రారంభం అయ్యిందా’’ అంటూ అమిత్‌ షా ప్రశ్నించారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి అందిందా?. గిరిజనులకు భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్‌ ఇచ్చారా?. ఉద్యోగాలు కేసీఆర్‌ కుటుంబాలకు తప్ప ఎవరికీ దక్కలేదు’’ అంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ వస్తారంటూ’’ అమిత్‌షా ధ్వజమెత్తారు.

రాజ్ గోపాల్ రెడ్డిని గెలిపిద్దాం… ఈ గెలుపు ద్వారా కేసీఆర్ పతనానికి నాంది పలుకుదామ‌ని మునుగోడు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో కెల్లా పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నాయన్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం రైతు వ్యతిరేకి ప్ర‌భుత్వ‌మ‌న్నారు. రాష్ట్రంలో బీజీపీ అధికారంలోకి వస్తే రైతు పండించిన ప్రతి గింజా కొంటామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారింద‌ని అమిత్ షా దుయ్య‌బ‌ట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like