ఢిల్లీ చెప్పులు మోసే గులాములు మీరు…
-బండి సంజయ్‌పై కేటీఆర్ సెటైర్
-వైరల్ అవుతున్న వీడియో
ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములు మీరు.. వారికి చుక్కలు చూపిస్తునది మేం.. దీనిని తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓ వీడియో షేర్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది..? ఆ వీడియోలో ఏముందంటే..
తెలంగాణ(Telangana)లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయం నడుస్తోంది. ఒకరిపై ఒకరు రాజకీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేసుకుంటున్నారు. కేసీఆర్ అన్నీ విధాలుగా మోసం చేశారని.. కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు ఇప్పించుకొని రాజ్యాధికారం చలాయిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీపై సైతం టీఆర్ఎస్ అదేస్థాయిలో కౌంటర్ ఇస్తోంది. తాజాగా మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amith Shah)తెలంగాణలో పర్యటించారు.
హైదరాబాద్ చేరుకున్న అమిత్‌షా ముందుగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారి ఆలయంలో పూజలు చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పులను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) స్వయంగా మోసుకెళ్లి కాళ్లకు తొడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తెలంగాణ బీజేపీ నేతలపై ప్రత్యక్షంగా, బీజేపీ అగ్రస్థాయి నేతకు పరోక్షంగా చురకలు అంటించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్. కేటీఆర్ ట్విట్టర్‌లో ట్యాగ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను-ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందటూ అటు బండి సంజయ్‌ని ఉద్దేశిస్తూ కామెంట్స్ పోస్ట్ చేశారు. అలాగే ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడు అంటూ కేసీఆర్‌ని ఉదాహరణగా చూపిస్తూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు కేటీఆర్. కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది.