ఈటెలకు పితృవియోగం
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) తండ్రి ఈటల మల్లయ్య (104) అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో చాలా రోజులుగా బాధపడుతున్నారు. హైదరాబాద్ (Hyderabad)లోని ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు. మల్లయ్య మరణవార్తను ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన భౌతిక కాయాన్ని హనుమకొండ జిల్లా కమలాపూర్ ఈటల స్వగృహానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఈటల కుటుంబీకులు తెలిపారు. ఈటల మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఎమ్మెల్యే ఈటలరాజేందర్ రెండో కుమారుడు. మల్లయ్య మృతితో కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లయ్యను కడసారి చూసేందుకు ఈటలను పరామర్శించేందుకు బీజేపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.